ఈ ఎన్నికలు అవినీతి రాజకీయం వర్సెస్ ప్రజాపాలన
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు అవినీతి రాజకీయాలకు, నిజాయితీ పాలనకు మధ్య పోరుగా మారాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డీసీసీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రధాన రోడ్లు, స్మార్ట్ సిటీ పనులకే పరిమితమైందని ఆరోపించారు. మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన నిర్మాణాల్లో అవినీతి జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. కరీంనగర్‌కు లా కాలేజీ మంజూరు చేసి విద్యాభివృద్ధికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎంఐఎంతో కుమ్మక్కయ్యామన్న ఆరోపణలను మంత్రి ఖండించారు. నగర భవిష్యత్తు కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.


