మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
కాకతీయ, హనుమకొండ : ఈ నెల 17న జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరిష్ సమక్షంలో నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, కలెక్టర్ నిశితంగా పర్యవేక్షించారు. జిల్లాలోని ఆత్మకూర్, దామెర, నడికూడ, శాయంపేట మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపోలింగ్ అధికారులు (ఓపీఓలు)ను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. మూడో విడతలో జిల్లాలో ఉన్న 68 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు, 634 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 626 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో డీఆర్‌డీఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి తదితరులు పాల్గొన్నారు.


