పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు..!
చిన్నగూడూరు పీఎస్‌లో సీజ్ చేసిన ఇసుక మాయం
వేలం వేయకుండా అధికారులే అమ్మేశారా..?
ట్రాక్టర్లకు జరిమానాలు విధించి వదిలేసిన అధికారులు
ఆ తర్వాత ఇసుకను అమ్మేశారంటూ మండలంలో చర్చ
విచారణ చేపట్టాలంటూ రెవెన్యూ అధికారికి వ్యక్తి ఫిర్యాదు
మింగలేక.. కక్కలేక అన్న రీతిలో పీఎస్ అధికారుల వైఖరి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన ఇసుక మాయమవడంపై ఎవరూ నోరు మెదపడం లేదు. ఎలాంటి అనుమతుల్లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను, అందులోని ఇసుకను చిన్నగూడూరు పోలీసులు గత నెల 21న సీజ్ చేశారు. జరిమానా విధించి ట్రాక్టర్లను వదిలేసిన పోలీసు అధికారులు.. ఇసుకను పోలీస్ స్టేషన్ ఆవరణలో నిల్వ చేశారు. సాధారణంగా ఇలా సీజ్ చేసిన ఇసుకను వేలం పాట ద్వారా విక్రయించి వచ్చిన నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా రెవెన్యూ అధికారులు ముందస్తుగా ప్రకటన చేసి.. వారి సమక్షంలో వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది. వేలం పాట జరగలేదు..కానీ చిన్నగూడూరు పీఎస్‌లో ఇసుక మాత్రం మాయమవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు నాకేం తెల్వదు : ఎమ్మార్వో సంపత్
సీజ్ చేసి పీఎస్‌లో నిల్వ ఉంచిన ఇసుక కనిపించడం లేదని, అధికారుల నుంచి కూడా ఎలాంటి సమాచారం ఉండటం లేదని దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ ఈనెల 4న తహసీల్దార్ సంపత్‌కు ఉప్పలయ్య అనే వ్యక్తి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అయితే ఇప్పటి వరకు ముందుకు సాగినట్లు కనిపించడం లేదు. ఈవిషయంపై కాకతీయ మహబూబాబాద్ ప్రతినిధి తహసీల్దార్ సంపత్‌ను ఫోన్‌లో వివరణ కోరగా.. ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న విషయం గాని, నిల్వ ఉంచిన విషయం గాని, వేలంపాట నిర్వహించారా..? లేదా అన్న విషయం గాని తనకు తెలియదని వెల్లడించడం గమనార్హం. సహజంగా ట్రాక్టర్లను పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మండల మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తహసీల్దార్ తనకు ఏమాత్రం సమాచారమే లేదని చెప్పడం ఇప్పుడు పోలీసుల నిబంధనలు పాటించలేదని, పూర్తిగా తమకు తోచినట్లుగా, ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతోంది. ఇదే విషయంపై చిన్నగూడూరు పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రవీణ్‌ను ఫోన్‌లో వివరణ కోరే ప్రయత్నం చేయగా స్పందించలేదు. చిన్నగూడూరు పీఎస్‌లో ఇసుక మాయమైన ఘటనలో పోలీసు అధికారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ ఘటనతో భాగస్వామ్యం ఉన్న వారంతా కూడా ఓ కథ అల్లి ఉన్నతాధికారులకు వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లోనే ఇసుక మాయం ఘటనపై సరైన వివరణ ఇవ్వలేక.. పోలీస్ స్టేషన్ అధికారుల పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్న చందంగా మారిందన్న చర్చ జరుగుతోంది.
దందాకు అధికారుల దారులు.. దారికి రాకుంటేనే తనిఖీలు
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని పోలీస్, రెవెన్యూ అధికారుల ఇసుక అక్రమ రవాణా కాసుల వర్షం కురిపిస్తోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ శాఖల్లోని చైన్ మేనేజ్‌మెంట్ వసూళ్ల పర్వంతో.. ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి అందినకాడికి దోచుకోవడం.. పైసలిస్తే సరేసరి.. లేదంటే నిబంధనలు..తనిఖీల పేరుతో దందాకు అడ్డు తగులుతూ దారికి తెచ్చుకోవడం అన్నది కొంతమంది అధికారులు అనుసరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానుల నుంచి వారం వారం వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు శాఖల అధికారులకు మాత్రం ఈ దందా రెండు విధాలా జేజుబులు నింపుతున్నట్లుగా కూడా ఆరోపణలున్నాయి.
పట్టుకున్నా పైసల్..విడిచినా పైసలే..
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా దందాలో అధికారులకు ట్రాక్టర్లను పట్టుకున్నా పైసల్..విడిచినా పైసలే అన్న చందంగా మారిందంట.మండలంలో ఇసుక అక్రమ రవాణా ఇసుకాసురులకే కాదు.. అధికారులకు ఆదాయ మార్గంగా మారుతోందంట. ఇసుక అక్రమ రవాణాపై నామమాత్రంగా చర్యలు తీసుకోవడం.. ఆతర్వాత మమ అనిపించే కథ చేస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ అద్వైత్‌కుమార్ స్వయంగా ఈ దందాపై ఫోకస్ చేయాలని కూడా జిల్లా ప్రజలు కోరుతున్నారు.


