రోడ్డు వేశారు… మట్టి మరిచారు!
అసంపూర్తి పనులతో తరచూ రోడ్డు ప్రమాదాలు
నరకయాతన పడుతున్న విద్యార్థులు
అధికారుల నిర్లక్ష్యంపై జనంలో ఆగ్రహం
కాకతీయ, చిగురుమామిడి : రోడ్డు నిర్మాణం పూర్తిచేసినా పక్కల మట్టి వేయకపోవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి నుంచి గాగిరెడ్డిపల్లి వరకు చెరువు కట్టపై రహదారి నిర్మాణం చేపట్టారు. అయితే రోడ్డుకు ఇరువైపులా మట్టి వేయకపోవడంతో మార్గం అసురక్షితంగా మారింది. గాగిరెడ్డిపల్లి నుంచి ఇందుర్తి పాఠశాలకు సైకిళ్లపై వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పక్కలు సరిగా లేకపోవడంతో జారిపడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది. అసంపూర్తి పనుల కారణంగా ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే స్పందించి రహదారి ఇరువైపులా మట్టి వేయించి సురక్షితంగా మార్గాన్ని అందుబాటులోకి తేవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.


