కష్టపడ్డోళ్లను పక్కకు నెట్టేస్తున్నరు
వలస లీడర్లకే ప్రాధాన్యముంటోంది
తినేప్పుడు వచ్చి కంచం గుంజుకున్నట్లుంది
కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బహిరంగంగా ఎండకట్టిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల పోలాస గ్రామంలో హాట్ కామెంట్స్..!
కాకతీయ, జగిత్యాల : పార్టీ కోసం అహర్నిశలు పదేళ్లు కష్టపడి పనిచేసిన నిజమైన నాయకులకు కాంగ్రెస్లో గుర్తింపు కరువవుతోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్నుంచి పార్టీకి సేవ చేసి.. పార్టీ అధికారంలోకి వచ్చిన వారిని పట్టించుకోకుండా.. పార్టీ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు పెత్తనం ఇవ్వడం, అవకాశాలు కల్పించడంపై ఆయన మండిపడ్డారు. తినోటోని ముందు ఉన్న కంచం లాక్కున్నట్లుగా వ్యవహారం ఉంటోందని కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. జగిత్యాల జిల్లా పోలాస గ్రామంలో పర్యటించిన మాజీమంత్రి అక్కడి కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోసం ముందునుంచి కష్టపడిన వారిని పక్కనబెట్టి, వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను సెలెక్ట్-ఎలెక్ట్ విధానంలో ఎంపిక చేసే విధానాన్ని పార్టీ అవలంభించాలన్నారు. పోలాస పౌలస్తీశ్వర ఆలయ ట్రస్ట్ సభ్యుల నియామకాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధం లేని వారిని ట్రస్ట్‌లో చేర్చడం సరికాదని, కాంగ్రెస్‌తో సంబంధం లేని బిఆర్ఎస్ నాయకులను ధర్మకర్తలుగా నియమించడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేశానని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తనకు కూడా పాత్ర ఉందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఉచిత కరెంట్, మహిళలకు ఫ్రీ బస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వంటి పథకాల ద్వారా అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.


