భారత పర్యటనలో పుతిన్‌కు మోదీ ఇచ్చిన 6 స్పెషల్ గిఫ్ట్స్ ఇవే..!
పుతిన్ భారత్ పర్యటన విజయవంతం
రష్యా అధ్యక్షుడికి మోదీ ఆరు విలువైన కానుకలు
అస్సాం టీ నుంచి వెండి గుర్రం వరకు
కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఎప్పటిలాగే రాజకీయంగా కాకుండా.. ఈసారి సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంతో మరింత రంగులమయమైంది. రెండు రోజుల ద్వైపాక్షిక సమావేశాల్లో పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించిన అంశాల్లాగే… ఆయన అందించిన బహుమతులూ హైలైట్ అయ్యాయి. భారత పర్యటనలో పుతిన్‌కు మోదీ 6 స్పెషల్ గిఫ్ట్స్ అందించారు. ఇవి కేవలం కానుకలే కాదు.. భారతదేశం అనే మహాసంపదను ప్రతిబింబించే వారసత్వ చిహ్నాలు. దేశ నలుమూలల నుంచి ఎంపిక చేసిన ఈ అరుదైన వస్తువులేంటో ఒకసారి పరిశీలిస్తే..
మోదీ స్వయంగా పుతిన్‌కు అందించిన అత్యంత ప్రత్యేకమైన బహుమతి రష్యన్లో అనువాదించిన శ్రీమద్ భగవద్గీత. ఇది భారత సంప్రదాయాల పరమార్థాన్ని తెలిపే గ్రంథం. అర్జునుడి సందేహాల తీరుస్తూ, శ్రీకృష్ణుడు చెప్పిన జీవన సారాంశం. పుతిన్‌కు భారతీయ ఆత్మను పరిచయం చేసే ప్రత్యేక మార్గం అయ్యింది.
ప్రపంచ ప్రఖ్యాత రుచికి చిహ్నమైన అస్సాం బ్లాక్ టీను పుతిన్‌కు మోదీ కానుకగా ఇచ్చారు. బ్రహ్మపుత్ర మైదానాల్లో పుట్టిన ఈ టీ ప్రపంచంలోకే అత్యధికంగా ప్రాచుర్యం పొందింది. 2007లో జిఐ ట్యాగ్ దక్కిన అస్సాం టీ… రుచితో, సువాసనతో, కాంతివంతమైన రంగుతో ప్రత్యేకతను సంతరించుకుంది. మోదీ అందించిన ఈ బహుమతి, భారత వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిఫలిస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పైస్.. హిమాలయాల్లో వేలాడే కాష్మీరీ సాఫ్రన్. భారత స్వచ్ఛ సుగంధంగా పిలవబడే కాశ్మీర్ కుంకుమపువ్వును మోదీ పుతిన్‌కు అందజేశారు. చేతితో చెక్కిన వెండి గురాన్ని కూడా రష్యా అధ్యక్షుడికి మోదీ గిఫ్ట్‌గా ఇచ్చారు. మహారాష్ట్ర లోహ శిల్పకారుల చేతుల్లో పుట్టిన ఈ సిల్వర్ హార్స్.. రెండు దేశాల మధ్య దౌత్య బంధం ఎంత బలంగా ఉందో సూచిస్తోంది. ఈ బహుమతి సామర్థ్యం, శక్తి, స్థిరత్వానికి చిహ్నం.
పుతిన్ కు మోదీ అందించిన మరో విలువైన కానుక ఆగ్రా పాలరాతి చదరంగం సెట్. ఆగ్రా నుండి తీసుకువచ్చిన ఈ మర్బుల్ చెస్ సెట్ పూర్తిగా హస్తకళతోనే తయారు చేసినది. తెల్లని పాలరాతి మీద కచ్చితత్వంతో తయారు చేసిన శిల్పాలు… భారత శిల్పకళ ఎంత నైపుణ్యంగా ఉంటుందో చూపిస్తాయి.
ముర్షిదాబాద్ వెండి టీ సెట్ ను సైతం భారత పర్యటనలో పుతిన్‌కు మోదీ బహుబతిగా ఇచ్చారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన ఈ వెండి టీ సెట్ క్లిష్టమైన చెక్కడాలతో, సున్నితమైన డిజైన్లతో ప్రపంచమంతా ప్రసిద్ధి చెందిన కళ. సాంప్రదాయ టీ సంస్కృతిని, భారత అతిథి సత్కారాన్ని ప్రతిబింబించే అందమైన గిఫ్ట్ ఇది.


