లోటుపాట్లు ఉండొద్దు
గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లుచేయాలి
తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం కావాలి
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మరికొద్ది రోజుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా.. తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ఈ సమ్మిట్ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఆదేశించారు. మంగళవారం ప్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ఈ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా పరిశీలించారు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అన్ని విభాగాల సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన స్పష్టం చేశారు. విభాగాల వారీగా అప్పగించిన బాధ్యతలు, వాటి పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు.
ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్ష
పలు దేశాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే డెలిగేట్స్, అతిథులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని సూచించారు. పార్కింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమ్మిట్ వేదిక వద్ద నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 5వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేసి.. 6వ తేదీన డ్రై రన్ కండక్ట్ చేయాలని ఉన్నతాధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.
దేశ విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు
డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు హైదరాబాద్ తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అలాగే భద్రతను సైతం కట్టుదిట్టం చేస్తుంది. అందుకోసం డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.


