యూరియా కొరత లేదు : కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం :జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో యాసంగి పంటల సాగును దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో యూరియా సరఫరా చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. ప్రస్తుత యాసంగి కాలంలో జిల్లాలో మొక్కజొన్న మరియు వరి ప్రధాన పంటలుగా సాగు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో మొక్కజొన్న పంట 38,500 ఎకరాల్లో, వరి పంట 8,750 ఎకరాల్లో సాగు అయిందని వెల్లడించారు. వరి నాట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఈ విస్తీర్ణం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఈ విస్తీర్ణానికి అనుగుణంగా జిల్లాలో యూరియా అవసరాన్ని అంచనా వేసి సరఫరా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాకు మొత్తం 28,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవగా అందులో 8,750 మెట్రిక్ టన్నులు ఇప్పటికే సరఫరా అయ్యాయని తలిపారు. ప్రస్తుతం జిల్లాలోని గోదాముల్లో 1,35,800 బస్తాల యూరియా నిల్వలు ఉన్నాయని అదనంగా 1,51,200 బస్తాల యూరియా త్వరలో జిల్లాకు చేరుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు ఎవరూ యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమున్న చోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు నిరంతరంగా యూరియా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వలన ఇతర రైతుల్లో అనవసర ఆందోళన ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ కష్టం చేశారు. యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అక్రమ నిల్వలు అధిక ధరలకు విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


