యూరియా కొరతకు తావులేదు
నర్సింహులపేటలో సజావుగా సరఫరా
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. సరిత
పీఏసీఎస్‌లో ఆకస్మిక తనిఖీ
కాకతీయ, నర్సింహులపేట : మండలంలో యూరియా సరఫరా సజావుగా కొనసాగుతోందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. సరిత స్పష్టం చేశారు. ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ద్వారా వంతడుపుల, నర్సింహులపేట రెవెన్యూ గ్రామాలకు 666 యూరియా బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి సరిత పీఏసీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. తనిఖీ అనంతరం ఆమె మాట్లాడుతూ యాసంగి పంట కాలానికి అవసరమైన మేరకు యూరియాను ముందుగానే కేంద్రాలకు చేరవేశామని తెలిపారు. రైతులు గందరగోళానికి గురికాకుండా నిబంధనల ప్రకారమే పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు. అవసరానికి మించి యూరియాను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలని రైతులకు సూచించారు.
అక్రమాలపై ఉక్కుపాదం
యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యూరియా పొందే సమయంలో రైతులు తప్పనిసరిగా యూరియా కార్డు, ఆధార్, పంట వివరాలు చూపించాలని తెలిపారు. రైతుల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో నానో యూరియా వినియోగం, పంట మార్పిడి విధానాలు, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. వినయ్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి డి. మౌనిక, పీఏసీఎస్ సీఈవో వెంకన్న, శివ, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.


