రైతు లేనిదే రాజ్యం లేదు
ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర
రైతులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
కాకతీయ, నెక్కొండ : రైతు లేనిదే రాజ్యం లేదని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు. ప్రతి గింజకు మద్దతు ధర హామీ ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం నెక్కొండ వ్యవసాయ కార్యాలయ కేంద్రంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు మధ్యవర్తుల వద్ద పంటను అమ్మి నష్టపోకూడదని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను విక్రయించాలని తెలిపారు. మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు 2400 మద్దతు ధర అందిస్తున్నామని తెలిపారు. రైతులకు న్యాయమైన ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పంటల కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు ధైర్యంగా కేంద్రాలకు పంట తీసుకురావాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ నీరజ, పర్సన్ ఇన్‌చార్జ్ విమల, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, మండల అధ్యక్షుడు బక్కి అశోక్, చెన్నారావుపేట అధ్యక్షుడు సిద్దేనా రమేష్, సర్పంచ్ హరిప్రసాద్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.


