ములుగులో గ్యాస్ కొరత లేదు
బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు
గ్యాస్ సరఫరాపై కలెక్టర్ సమీక్ష
పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో గృహ వినియోగానికి సంబంధించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో పోలీస్, పౌర సరఫరాలు, రవాణా, విద్య, వైద్య శాఖల అధికారులతో గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల్లో గ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే సంబంధిత అధికారులు ఆయా విద్యాసంస్థలను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు.
ప్రత్యేక కమిటీతో పర్యవేక్షణ
రాష్ట్ర పౌరసరఫరాలు మరియు సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా పౌరసరఫరాల అధికారి కన్వీనర్‌గా పన్నెండు మంది సభ్యులతో డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటయ్యిందన్నారు. ఈ కమిటీలో ఎస్పీ, అదనపు కలెక్టర్, జిల్లా రవాణా అధికారి, డీఈవో, జిల్లా సంక్షేమ అధికారులు, వ్యవసాయ అధికారి, జిల్లా వైద్యాధికారి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు గ్యాస్ తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కమర్షియల్ వినియోగానికి ఉపయోగిస్తున్న పదకొండు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఒక ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఏడు ఒక సున్నా తొమ్మిది కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి షా ఫైజల్ హుస్సేనీ, జిల్లా వైద్యాధికారి గోపాల్ రావు, వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.


