మోదీ, విజయన్‌కు తేడా ఏంలేదు
బీజేపీ తమ ఓటు బ్యాంకును మార్పిడి అయ్యేలా చూస్తున్నారు
కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి
ముట్టతార రోడ్‌షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి
ప్రధాని, కేరళ సీఎంపై ఘాటు విమర్శలు
కేరళం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపు
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారం
కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. పినరయ్ విజయన్ ద్వారా కేరళం భవిష్యత్తును అపహరించాలని చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే బీజేపీ నాయకులు తమ ఓటు బ్యాంకును విజయన్‌కు మార్పిడి అయ్యేలా చూస్తున్నారన్నారు. కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్ఎమ్ లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించి కేరళంను అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని అక్కడి ప్రజలకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీపై రేవంత్ రెడ్డి పలు విమర్శలు గుప్పించారు.
కేరళంలో మరో రెండు రోజులు సీఎం పర్యటన
స్టార్ క్యాంపెయినర్‌గా నియామకమైన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డ అక్కడ జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఇవాళ , రేపు రెండు రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళంలో పర్యటిస్తారు. ఇవాళ త్రివేండ్రం, అలప్పుజ, ఎర్నాకుళంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ రోడ్ షో తరువాత త్రివేండ్రంలోని భారతన్నూర్ లో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం పూవాచల్, వెల్లండ్ ప్రాంతాల్లో జరిగే రోడ్ షోలల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం అలప్పుజ వద్ద జరగనున్న కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రికి ఎర్నాకులంలో బస చేస్తారు.
తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా వీళ్లే ..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది. మూడు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఒక్కొక్క రాష్ట్రానికి 40 మంది చొప్పున నియమించారు. కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా ఉప ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించనున్నారు. మరోవైపు పుదుచ్చేరి స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నియమితులయ్యారు.


