చివరి బుజ్జగింపులూ విఫలం
జీవన్‌రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ ఫలితం శూన్యం
పార్టీకి గుడ్‌బై చెప్పడానికే కట్టబడిన మాజీమంత్రి
అవమానాలను ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగలేనని స్పష్టం
జగిత్యాలలో రేపు అనుచరులతో కలిసి సభ నిర్వహణ
పార్టీలో అత్యంత సీనియర్ బయటకు వెళ్తుండటంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చ
తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు పునాదంటూ విశ్లేషణలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పార్టీలో వరుస అవమానాలు ఎదురవుతున్నాయని, ఇక కొనసాగడం సాధ్యం కాదని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. చివరి వరకూ సాగిన బుజ్జగింపులు విఫలమవడంతో తన నిర్ణయంపై ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల కేంద్రంగా భారీ రాజకీయ దెబ్బగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన భేటీ రాజకీయంగా కీలకంగా మారింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి ఆయనను కలిశారు. దాదాపు నలభై నిమిషాల పాటు చర్చలు సాగాయి. పార్టీలో కొనసాగాలని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని నాయకులు విన్నవించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు సేవలందించిన సీనియర్ నేత అని గుర్తు చేశారు. తనకు 1986 నుంచే ఆయనతో అనుబంధం ఉందని తెలిపారు. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు సహజమని, అలాంటి సమయంలో పార్టీని వీడటం సరైంది కాదని సూచించారు. ఏఐసీసీ నాయకత్వం కూడా జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగాలని కోరుతోందని చెప్పారు. అయితే ఈ బుజ్జగింపులన్నింటినీ జీవన్ రెడ్డి తోసిపుచ్చినట్లు స్పష్టమైంది. పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని, నిర్ణయాల్లో తనను పక్కనపెడుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో కొనసాగడం కంటే బయటకు రావడమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

ప్లెక్సీ తొలగింపు.. రాజకీయ సంకేతం
భేటీ అనంతరం జీవన్ రెడ్డి నివాసంపై ఉన్న కాంగ్రెస్ ప్లెక్సీని అభిమానులు తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇది సాధారణ సంఘటన కాదు. స్థానిక స్థాయిలోనే కాదు, రాష్ట్రస్థాయిలో కూడా ఈ చర్యకు ప్రత్యేక అర్థం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కేడర్ మద్దతు ఉన్నదనే సంకేతం ఇది. జీవన్ రెడ్డి అసంతృప్తి ఒక్కరోజులో ఏర్పడింది కాదు. గత కొంతకాలంగా పార్టీ లోపలి పరిణామాలు, కొత్త నాయకులకు పెరుగుతున్న ప్రాధాన్యం, స్థానిక రాజకీయ సమీకరణాలు ఆయనను అసహనానికి గురిచేశాయని తెలుస్తోంది. ముఖ్యంగా తన అనుభవానికి తగ్గ గౌరవం దక్కలేదనే భావన బలంగా ఏర్పడినట్లు సమాచారం. ఇది వ్యక్తిగత అసంతృప్తిని రాజకీయ నిర్ణయంగా మార్చిందని చెప్పవచ్చు.
రేపే కీలక ప్రకటన
మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి సమస్య పరిష్కారం కాని దశకు చేరుకుందని తెలిపారు. కాంగ్రెస్‌లో ఉండి స్వపక్షంతో యుద్ధం చేయడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించి తన భవిష్యత్ రాజకీయ పయనాన్ని ప్రకటిస్తానని తెలిపారు. తన నిర్ణయాన్ని దైవ నిర్ణయంగా భావిస్తున్నానని చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగిత్యాలలో బండారు గార్డెన్స్‌లో జరగనున్న ఈ సభకు భారీగా కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేదికపైనే రాజీనామా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు స్థానికంగా పెద్ద దెబ్బ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర పార్టీలకు ఇది అవకాశంగా మారవచ్చు. ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏదన్నదానిపై ఆధారపడి రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన చివరి ప్రయత్నాలు విఫలమవడంతో తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే పరిస్థితి స్పష్టమవుతోంది. జీవన్ రెడ్డి నిర్ణయం కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారుతోంది.


