హనుమకొండలో కలకలం..
వాగులో తేలిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం..
కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముప్పారం వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించిన ఘటన ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వాగు వద్ద పంటచేలు చూసేందుకు వెళ్లిన స్థానిక రైతులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవాడిగా అంచనా వేస్తున్నారు. అయితే మృతుడి గుర్తింపు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలానికి క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్ చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. ప్రాథమికంగా పోలీసులు ఇది ప్రమాదమా, ఆత్మహత్యా లేక వేరే కారణాలవల్ల జరిగినదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడి గుర్తింపు తెలియ జేయాలని స్థానిక ప్రజలను పోలీసులు కోరారు. ఈ ఘటనపై ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


