భూమి వివాదంతో కలెక్టరేట్ వద్ద కలకలం
కుటుంబం ఆత్మహత్యాయత్నం
కాకతీయ, కరీంనగర్ : జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి వద్ద సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గన్నేరువరం మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భూమి వివాదం కారణంగా ఈ దారుణ చర్యకు దిగినట్లు సమాచారం. పోలీసులు సమయానికి చాకచక్యంగా స్పందించి వారిని అడ్డుకున్నారు.వివరాల ప్రకారం.గోపాలపూర్‌కు చెందిన రైతు కుటుంబం గత 70 ఏళ్లుగా 8 ఎకరాల భూమిని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తోందని తెలిపింది. అయితే కొంతమంది ప్రభావశీలులు అక్రమ పత్రాలు సృష్టించి తమ భూమిని లాక్కున్నారని బాధితులు ఆరోపించారు. ఈమేరకు తాము అనేకసార్లు మాండలిక, జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. చివరికి తమకు న్యాయం జరగకపోవడంతో ఆవేదనతో కుటుంబమంతా కలెక్టరేట్ వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు.ఈ ఘటనతో కలెక్టరేట్ వద్ద ఒకసారిగా ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న ప్రజలు, అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.



