నడికూడ జెడ్పిటిసి బరిలో పలువురు ఆశావాహులు.
జనరల్ స్థానం కావడంతో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం.
కాకతీయ, నడికూడ: హనుమకొండ జిల్లా నడికూడ జడ్పిటిసి జనరల్ రిజర్వేషన్ రావడంతో పలువురు అధికార ప్రతిపక్ష నేతలు పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నుండి ముగ్గురు నేతలు ఇప్పటికే రంగంలో ఉన్నట్లు వినికిడి. చర్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి విధేయుడిగా నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు వున్న భీముడి నాగిరెడ్డి, ఇదే గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నందికొండ జయపాల్ రెడ్డి, వరికోల్ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, పేర్లు బిఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా వున్నాయి. అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ నుండి చర్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, రాయపర్తి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పర్నెం శ్రీలత -మల్లారెడ్డి, పేర్లు కాంగ్రెస్ అధిష్టానం వద్ద పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే బిజెపిలో చేరిన నడికూడ మండల కేంద్రానికి చెందిన ఐపీఎస్, స్కై,విద్యా సంస్థల చైర్మన్ మొర్రి (ఐపిఎస్) కుమార్ యాదవ్, బిజెపి నుండి జడ్పిటిసి స్థానం కొరకు టికెట్ ఆశిస్తున్నట్లుతెలుస్తుంది. జనరల్ స్థానంలో బీసీ బిడ్డగా కూడా కుమార్ యాదవ్ కు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు సన్నిహితుల నుండి సమాచారం. ఏది ఏమైనప్పటికీ అనుచరుల ప్రోద్బలంతో జడ్పిటిసి బరిలో వీరు ఉంటారనే విషయం మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.
మరికొద్ది రోజులలో జడ్పిటిసి అభ్యర్థులు గా ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ పెద్దల ఆశీస్సులు ఎవరికి ఉంటాయో వేచి చూడాలి మరి.


