నుస్తులాపూర్‌లో మోటార్ వైర్ల దొంగతనం
పదిమంది రైతులకు భారీ నష్టం
వరుస దొంగతనాలతో రైతుల ఆందోళన
రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా
పోలీసుల తనిఖీలు.. దర్యాప్తు ముమ్మరం..!
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ గ్రామంలో రైతుల మోటార్ విద్యుత్ వైర్ల దొంగతనం కలకలం రేపింది. గుర్తు తెలియని దొంగలు వ్యవసాయ బోర్లకు సంబంధించిన విద్యుత్ వైర్లను ఎత్తుకెళ్లడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో సుమారు పదిమంది రైతులకు చెందిన వైర్లు మాయం కాగా, ఒక్కో రైతుకు రూ.25 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. బోర్లకు వేసిన విద్యుత్ వైర్లను ఒక్కో రైతు వద్ద 5 నుంచి 8 సార్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. పదేపదే దొంగతనాలు జరుగుతున్నా చర్యలు లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
చెట్లు–పొదల్లో కాపర్
బాధిత రైతుల ఫిర్యాదు మేరకు తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తిమ్మాపూర్ మండల సీఐ సదన్‌కుమార్, ఎస్‌ఐ శ్రీకాంత్, నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాస్‌రావుతో కలిసి దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విద్యుత్ వైర్ల నుంచి కాపర్‌ను వేరు చేసి చెట్లు, పొదల్లో దాచిన ప్రాంతాలను పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో రాత్రి గస్తీ పెంచాలని రైతులు కోరుతున్నారు.


