తోడబుట్టిన తమ్ముడే చంపిండు..!
కొండాపురంలో హత్య కేసు చేధించిన పోలీసులు
30 ఏండ్ల నాటి భూ తగాదాలే కారణం
ఎవరూ లేని సమయంలో పారతో అన్నపై తమ్ముడి దాడి
నిందితుడు వెంకన్న అరెస్టు
కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో ఈనెల 5వ తేదీ సోమవారం చోటుచేసుకున్న కొండ వీరస్వామి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. మృతుడి తోడబుట్టిన తమ్ముడు కొండ వెంకన్న (58)నే హత్యకు పాల్పడినట్లు బుధవారం నిర్ధారించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు వీరస్వామికి తమ్ముళ్లు లక్ష్మయ్య, వెంకన్న ఉన్నారు. వీరస్వామి, చిన్న తమ్ముడు వెంకన్న మధ్య వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలకు సంబంధించి గత 30 సంవత్సరాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నను హతమార్చేందుకు వెంకన్న పక్కా పథకం వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం బ్యాంకు పనులు ముగించుకుని వీరస్వామి నేరుగా తన పొలం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న మరో తమ్ముడు లక్ష్మయ్యను చేపలు పట్టడానికి వెళ్దామని చెప్పి, కుండ తీసుకురావాలని పంపించాడు. అనంతరం నల్లకుంట చెరువు శిఖం వద్ద గుండ్ల బండ సమీపంలోని నీటిమడుగులోకి చేపలు పట్టేందుకు దిగాడు.
ఎవరూ లేని సమయంలో పారతో దాడి
ఈ అవకాశాన్ని గమనించిన వెంకన్న ఇదే సరైన సమయమని భావించి, పక్కనే ఉన్న పారతో వీరస్వామి తలపై, కుడి భుజంపై, ఛాతిపై బలంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి కుండ తీసుకుని వచ్చిన లక్ష్మయ్య నీటిమడుగు వద్ద అన్న విగతజీవిగా పడి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకన్నను రాయపర్తి బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. కేసును ఛేదించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ అంబటి నర్సయ్యలు సీఐ కొమ్మూరి శ్రీనివాస్, ఎస్సై ముత్యం రాజేందర్‌లను అభినందించారు.


