కాకతీయ, కరీంనగర్ : పేదల సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఇల్లంతకుంట మండల పరిషత్ సమావేశ మందిరంలో 19 మందికి కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కులు, 51 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం కోసం పథకాల అమలులో వెనుకంజ వేయడం లేదని తెలిపారు.
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, అనారోగ్యంతో బాధపడేవారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా త్వరితగతిన ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఫారూఖ్, ఎంసీడీవో శశికళ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటి రెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె అయిలయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


