కనుల పండుగగా స్వామి వారి కల్యాణం
కుటుంబ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే నాయిని
కాకతీయ, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 51వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయనతో పాటు సతీమణి నాయిని నీలిమ రెడ్డి, కుమార్తె డాక్టర్ గోదా రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక బృందం ఎమ్మెల్యే దంపతులకు సాదర స్వాగతం పలికింది. కనుల పండుగగా సాగిన స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే నాయిని ఆసాంతం తిలకించారు. లోక కల్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో సుఖశాంతులు నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొండ నాగరాజు, ఆలయ కమిటీ చైర్‌పర్సన్ రంగనాయకమ్మ, నరేందర్, సబితా రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


