పోడు భూములకు పట్టాలివ్వాలి
తుడుం దెబ్బ డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం : పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏటూరునాగారం మండల తుడుం దెబ్బ అధ్యక్షులు తాటి నీలాద్రి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనుల పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో కందకాలు తీయడం తగదన్నారు. ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఫారెస్ట్ అధికారులు కాలరాస్తున్నారని అన్నారు. ఫారెస్ట్ అధికారులు హక్కులను ఉల్లంఘిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని, ప్రజల బతుకుదెరువుకు ఆటంకం కల్పిస్తే ఫారెస్ట్ అధికారులను గ్రామాల్లోకి రానివ్వమని ఆయన హెచ్చరించారు. వెంటనే పాలకులు పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని నీలాద్రి డిమాండ్ చేశారు.


