తిరుగులేని ప్రదీప్‌రావు..!
వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో మరోసారి విజయం
ఎర్రబెల్లి ప్యానెల్‌కు పట్టం కట్టిన ఖాతాదారులు
నమ్మకాన్ని వమ్ము చేయను : ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ పరిపాలన కమిటీ ఎన్నికల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్యానల్ ఘనవిజయం సాధించారు. ఎన్నికల బరిలో 25 మంది నిలవగా 12 మంది ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్యానల్గా ఏర్పడ్డారు. గత 25 సంవత్సరాలుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు బ్యాంకు చైర్మన్ గా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి బ్యాంకు ఎన్నికలు రాజకీయ రంగు పులుముకోవడంతో కొంత రసవత్తరంగా మారాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వరంగల్ ఏవివి జూనియర్ కళాశాలలో జరిగిన వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో మొత్తం 6,368 ఓట్లకు 2,442 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి వాల్యా నాయక్ వెల్లడించారు. పోలైన ఓట్లలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్యానల్ మెజార్టీ ఓట్లు సాధించి విజయం సాధించారని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి మా ప్యానల్ ని గెలిపించిన ఖాతాదారులందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. మా పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, రానున్న రోజుల్లో వరంగల్ కో-ఆపరేటివ్ బ్యాంకు ను తెలంగాణ రాష్ట్ర మొత్తం విస్తరించి బ్యాంకు ను అభివృద్ధి చేస్తామని తెలియజేశారు.


