- రాజకీయాలకు అతీతంగా చాలా మందికి ఆయనంటే అభిమానం
- అందరినీ ఒక వేదిక మీదకు తేవడం దత్తాత్రేయకే సాధ్యం
- అలయ్ బలయ్ వేదికపై సినీ, రాజకీయ ప్రముఖుల కితాబు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: దత్తన్న తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశ రాజకీయాల్లోనే అజాత శత్రువు అని మాజీ గవర్నర్, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ప్రముఖులు కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా చాలా మందికి ఆయనంటే ప్రత్యేక అభిమానమని అన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా అందరిని ఒక వేదిక మీదకు తేవడం దత్తాత్రేయకే సాధ్యమని, వారు సమాజ ఐక్యత కోసం చేస్తున్న కృషి స్పూర్తి దాయకమన్నారు. బండారు దత్తాత్రేయకు ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నామని తెలిపారు.
నాయకుల మధ్య ఐక్యత కోసం…
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా దసరా మరునాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటిచెప్పేలా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఆపరేషన్ సిందూర్ థీమ్‌తో ఈ కార్యక్రమం జరుగుతోంది.
తరలివచ్చిన ప్రముఖలు

ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్, జయంతి చౌదరి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ వి.హనుమంతావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, టాలీవుడు ప్రముఖ నటులు నాగార్జున, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.


