టీవీ సీరియల్ తెచ్చిన తగువు
భార్యభర్తల మధ్య గొడవ
తల్లి చనిపోతుందేమోనని భయంతో గడ్డి మందు తాగిన కుమారుడు
కాకతీయ, బయ్యారం :
మండలంలోని గౌరారం పంచాయతీ పరిధిలో కోడిపుంజుల తండా గ్రామంలో టీవీ సీరియల్ ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. టీవీ సీరియల్ చూడొద్దని, ఇంట్లో పని చేసుకోవాలని, భర్త మందలించడంతో భార్యాభర్తల మధ్య తగువు చిలికి ,చిలికి గాలి వానలా మారింది. దీన్ని చివరకు కుమారుడి ప్రాణాల మీదకు తీసుకువచ్చారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారవత్ కవిత, భర్త రాజు కోడి పుంజుల గ్రామంలో నివాసం ఉంటున్నారు. గురువారం భర్త రాజు ఇంటి నుంచి పని మీద మహబూబాబాద్ వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తను చెప్పిన పని చేయమని భార్యను మందలించాడు. దీంతో చూస్తున్న కవిత సీరియల్ అయిపోయిన తర్వాత పనిచేస్తానని తెలపడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన సంఘటన మర్చిపోకుండానే శుక్రవారం మరోసారి కుటుంబంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. దీంతో కవిత తన కుమారుడి ముందే ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి చనిపోతున్నానంటూ నోటి దగ్గర పెట్టుకుంది. ఇది చూసిన వారి కుమారుడు మున్నా (11) మా అమ్మ మందు తాగి చనిపోతుందేమోనని భయంతో తల్లి చేతిలో ఉన్న గడ్డి మందును తీసుకొని తాను తాగాడు. వెంటనే బాలుడు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో స్థానికులు హుటాహుటిన శుక్రవారం ఉదయం మహబూబాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించినట్లు సమాచారం. బాలుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఎస్సై తిరుపతిని వివరణ కోరగా జరిగిన సంఘటన వాస్తవమేనని ఎవరూ తమకు, ఫిర్యాదు చేయలేదని తెలిపారు.


