ఆదివాసీ మ్యూజియం అద్భుతం
చరిత్రను, సంస్కృతిని కళ్లకు కడుతున్న కేంద్రం
తరతరాల ఆదివాసీల జీవన చిత్రణకు అద్దం
మేడారంలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న మ్యూజియం
కాకతీయ, మేడారం బృందం : ఆదివాసీల ఆచారాలు,వారి అపురూప సంస్కృతి, ప్రకృతితో పెనవేసుకున్న జీవనశైలిని కళ్లకు కట్టే అద్భుత వేదికగా మేడారం ఆదివాసీ మ్యూజియం విరాజిల్లుతోంది.సమ్మక్క-సారలమ్మ గద్దెల చెంతన కొలువైన ఈ మ్యూజియంను కేవలం విజ్ఞాన కేంద్రంగానే కాకుండా,గిరిజన వారసత్వ సంపదకు నిలువుటద్దంగా నిలుస్తోంది.ఆదివాసీలు కోయ తెగ వారు ఉపయోగించే గృహోపకరణాలు,వేట పరికరాలు,వంట పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వారు అడవిలో ఎలా జీవిస్తారు,వేట ఎలా సాగిస్తారు వారి పండుగలను ఎలా జరుపుకుంటారో తెలిపే విగ్రహాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.జాతరకు వచ్చిన భక్త జనం ఈ మ్యూజియంను ఎంతో ఆసక్తిగా సందర్శిస్తున్నారు.సాంప్రదాయ దుస్తులు గిరిజన తెగలు ధరించే విభిన్నమైన దుస్తులు,వారు తయారుచేసుకునే ప్రత్యేకమైన ఆభరణాలు చూస్తూ మురిసిపోతున్నారు.
కనువిందు చేస్తున్న హస్తకళలు
తరతరాలుగా ఆదివాసీలు అందిపుచ్చుకున్న హస్తకళలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.వెదురుతో చేసిన బుట్టలు,వేట కోసం ఉపయోగించే విల్లంబులు,చేపలు పట్టే సాధనాలు గిరిజనుల సృజనాత్మకతకు నిదర్శనం.ఆధునిక కాలంలో అంతరించిపోతున్న పురాతన లోహ కళారూపాలు,మట్టి పాత్రలు ఇక్కడ భద్రపరిచారు.తమ పూర్వీకుల జీవన విధానాన్ని చూసి నేటి తరం పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మ్యూజియం లోపలికి అడుగుపెట్టగానే గిరిజన గూడెంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.కోయ తెగ వారు వేసే కొమ్ము నృత్యం,వారు ధరించే సాంప్రదాయ దుస్తులు,ఆభరణాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన నిలువెత్తు విగ్రహాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మల వీరగాథను వివరించే చిత్రపటాలు భక్తుల్లో భక్తిభావంతో పాటు స్ఫూర్తిని నింపుతున్నాయి. ఆదివాసీల గుడిసెలు,ఎడ్ల బండ్లు వారి సాంప్రదాయ పరికరాల వద్ద భక్తులు ఫోటోలు దిగడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.పిల్లలతో వచ్చే పర్యాటకులు,తమ సంస్కృతిని గిరిజన జీవన విధానాన్ని తర్వాతి తరానికి పరిచయం చేయడానికి ఇది ఒక చక్కని వేదిక అన్నారు.



