అడవి పులకించె…సారలమ్మ ఆగమానికి స్వాగతం
కన్నెపల్లి నుంచి గద్దల వైపు సారలమ్మ రాక
పూనకాల హోరు… శివసత్తుల ఊగిసలాటతో శివాలూగిన మేడారం
కాకతీయ, మేడారంబృందం : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలి రోజైన బుధవారం రాత్రి అడవిమాతల ఆగమనంతో మేడారం పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడాయి. అడవీ మార్గాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోగా, డోలు దరువులు, కొమ్ము బూరల నాదాల మధ్య అడవి పులకించిపోయింది.
కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దెకు చేరుకుంటోంది. సారలమ్మతో పాటు కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు కూడా గద్దెలపై కొలువుదీరుతున్నారు. గిరిజన పూజారుల సంప్రదాయ పూజల మధ్య అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్టించగా, భక్తుల జయజయధ్వానాలతో మేడారం మార్మోగింది.
పూనకాల పరవళ్లు… భక్తజన సంద్రంగా మారిన అరణ్యం
తల్లుల ఆగమనంతో శివసత్తుల పూనకాలు, గిరిజన నృత్యాలు, భక్తుల ఊగిసలాటలతో మేడారం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది. జంపన్నవాగు పరిసరాల్లో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. నాటుకోళ్లు, బెల్లం మొక్కులతో వనదేవతలకు భక్తులు తమ కృతజ్ఞతను చాటుతున్నారు














