బలం లేనిచోట అధికార పార్టీ ప్రలోభాలు
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం…
ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్
కాకతీయ, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో భాగంగా మంగళవారం వైరా మండలం కే.జీ. సిరిపురం గ్రామంలో ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ పర్యటించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి జరగాలని, అయితే అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఎన్నికల్లో విజయం కోసం అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులపై ఒత్తిడి తీసుకురావడం, నామినేషన్లు విత్‌డ్రా చేయాలని బెదిరించడం వంటివి గతంలో ఎన్నడూ జరగలేదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బలం లేని గ్రామాలలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి పార్టీ మార్పించడం దౌర్భాగ్యమన్నారు.
నేలకొండపల్లి మండలం, శంకరగిరి తండాలో గిరిజన రైతు వీరన్న ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దీనిని ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు.రుణమాఫీ పూర్తిగా జరగకపోవడం, కౌలు రైతులకు ప్రభుత్వ భరోసా లేకపోవడం వంటి కారణాల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనికి జిల్లా మంత్రులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లేక, మార్కెట్లపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం రైతులు కష్టపడి పండించిన పత్తిని కారు చౌకగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ నైజాన్ని, మోసాలను ప్రజలందరూ అర్థం చేసుకుని, బీసీలను, రైతులను, మహిళలను మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని స్థానిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మద్దెల రవి, వనమా విశ్వేశ్వరరావు, శెట్టిపల్లి శ్రీనివాస్, బొడ్డు రామకృష్ణ, మాదినేని ప్రసాద్, వాజినేపల్లి చక్రవర్తి, బొడ్డు నాగ ప్రతాప్, దమ్మలపాటి బసవయ్య, నారపోగు కృష్ణార్జునరావు, పరుచూరి రామారావు, బొడ్డు రంగా, అయినాల కనకరత్నం, నారపోగు అయోధ్య రామయ్య, పుచ్చకాయల బాబు, ఆదిబండ్ల శ్రీనివాసరావు, ఆదూరి ప్రేమ్ మరియు తదితరులు పాల్గొన్నారు.


