క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయం
అహింస, సత్యం, ధర్మ మార్గమే క్రిస్మస్ సందేశం
మతసామరస్యానికి క్రైస్తవుల సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అహింస, నీతి, సత్యం, ధర్మ గుణాలతో జీవించాలనే యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం కొత్తగూడెం పట్టణం మరియు పరిసర గ్రామాల్లోని పలు చర్చీల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చర్చీల్లో క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, సర్వమతాలు మంచినే బోధిస్తాయని, అన్ని మతాల లక్ష్యం సమాజంలో శాంతి నెలకొల్పడం, మానవ సంబంధాలను మరింత బలోపేతం చేయడమేనని అన్నారు.
పేదలతో పండుగ పంచుకోవడం గొప్ప ఆచారం
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలు పేదలకు తమవంతు సహకారం అందిస్తూ పండుగ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయడం అభినందనీయమని చెప్పారు. కుల, మత భేదాలు లేకుండా అందరినీ చర్చీలకు ఆహ్వానించి మతసామరస్యాన్ని చాటడం గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ విధమైన ఆచారాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి నెలకొల్పడంలో చర్చీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని కూనంనేని హామీ ఇచ్చారు. అలాగే చర్చీల పాస్టర్ల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రకటించి అమలు చేయాలని సూచించారు. ఉత్సవాలకు ఆహ్వానించిన చర్చి కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.వీరస్వామి, దుర్గారాసి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, చర్చి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


