జాతీయ వేదికపై నెల్లికుదురు ఉపాధ్యాయురాలి ప్రతిభ
అంజుమ్ సుల్తానా పరిశోధన పత్రానికి ప్రత్యేక గుర్తింపు
కాకతీయ, నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఒస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11 వరకు నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె సమర్పించిన పరిశోధన పత్రం ఎంపికై ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.దేశవ్యాప్తంగా వేలాది పరిశోధనా పత్రాలు సమర్పించబడిన నేపథ్యంలో “వన్ నేషన్–వన్ ఎలక్షన్: కేంద్ర–రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అధ్యయనం” అనే అంశంపై ఆమె సమర్పించిన పత్రం ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. రాజ్యాంగ నిర్మాణం, ఒకే దేశం–ఒకే ఎన్నికల విధానం అమలు సాధ్యతపై సమగ్ర విశ్లేషణను ఆమె తన పరిశోధనలో ప్రతిపాదించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ సదస్సులో మహబూబాబాద్ జిల్లా నుంచి ఎంపిక కావడం గర్వకారణమని అంజుమ్ సుల్తానా తెలిపారు. విద్యా రంగంలో జిల్లా ప్రతిభ మరోసారి జాతీయ వేదికపై మెరవడం అభినందనీయమని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు, జిల్లా విద్యాధికారి రాజేశ్వర్ రావు, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.


