విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న 26మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలతో పేద విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది విద్యార్థులు అస్వస్థతకు గురవగా, కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిశుభ్రత లేకపోవడం, పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే రేవంత్ రెడ్డి తన వైఫల్యానికి నైతిక బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం, సురక్షిత వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.


