- బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు
కాకతీయ, కరీంనగర్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను, యాజమాన్యాలను గోస పెడుతోందని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు విమర్శించారు. గురువారం కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు గడిచినా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించే వరకు కళాశాలలు బంద్ కొనసాగుతాయనే యాజమాన్యాల ప్రకటనతో విద్యార్థులు అకాడమిక్ ఇయర్‌ను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల చదువుల కష్టాలను తీర్చాలనే సంకల్పంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసి రవాణా కష్టాలు తీర్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12,292 మంది విద్యార్థుల టెన్త్ పరీక్ష ఫీజును తన జీతం నుండి చెల్లించేందుకు బండి సంజయ్ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని పేర్కొన్నారు.గురువారం సాయంత్రం బోరబండలో జరగాల్సిన బండి సంజయ్ మీటింగ్‌కు అనుమతులు ఇచ్చి, ఆపై రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గడం సరికాదని ప్రవీణ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


