పరకాల పురపోరుకు రంగం సిద్ధం
రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణలు
పార్టీలకు సవాల్‌గా మారిన ఎన్నికలు
కాకతీయ, పరకాల : పరకాల మునిసిపాలిటీలో జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం మునిసిపాలిటీలో మొత్తం 22 వార్డులు, 26,812 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 12,948 మంది పురుష ఓటర్లు, 13,864 మంది మహిళా ఓటర్లు ఉండటంతో మహిళలు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఈ సంఖ్యలే ఈసారి పరకాల మునిసిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర ఎంత కీలకమో స్పష్టంగా చూపిస్తున్నాయి.
రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణలు
రిజర్వేషన్ల పరంగా పరకాల మునిసిపాలిటీ ప్రత్యేకతను సంతరించుకుంది.
మొత్తం 22 వార్డుల్లో జనరల్ – 5, జనరల్ మహిళ – 8, బీసీ మహిళ – 3, ఎస్సీ మహిళ – 2, బీసీ జనరల్ – 4,ఎస్సీ జనరల్ – 3, ఎస్టీ జనరల్ – 1, మొత్తంగా 13 వార్డులు మహిళలకు రిజర్వ్ కావడం విశేషం. ఇది మునిసిపాలిటీ రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి విస్తృత అవకాశాలను కల్పిస్తోంది. దాదాపు ప్రతి వార్డులోనూ మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉండటం ఈ ఎన్నికల ప్రత్యేకత. ముఖ్యంగా జనరల్ మహిళ, బీసీ మహిళ, ఎస్సీ మహిళ రిజర్వ్ వార్డుల్లో మహిళా ఓటర్లే ఫలితాలను శాసించే స్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మహిళా సమస్యలు, సంక్షేమ పథకాలు, భద్రత, ఉపాధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
పార్టీలకు సవాల్‌గా మారిన ఎన్నికలు
రిజర్వేషన్ల సమీకరణలు, ఓటర్ల కూర్పు, మహిళా ఓటర్ల ఆధిక్యం కారణంగా ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు సవాలుగా మారనున్నాయి. సరైన అభ్యర్థుల ఎంపిక, వార్డు స్థాయి వ్యూహాలు, మహిళలు–యువతను ఆకట్టుకునే ప్రచారమే గెలుపుకు కీలకంగా మారనుంది. మొత్తంగా పరకాల మునిసిపాలిటీ ఎన్నికలు మహిళా ఓటర్ల ఆధిపత్యం, సామాజిక వర్గాల సమతుల్యత, కీలక వార్డుల్లో గట్టి పోటీ నేపథ్యంలో అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఈసారి పరకాల మునిసిపల్ పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న నిర్ణయం మహిళా ఓటర్ల చేతుల్లోనే ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.


