దుగ్యాల సేవలు చిరస్మరణీయం
పాలకుర్తి అభివృద్ధికి చిరస్థాయి ముద్ర
చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వెల్తూరి మల్లేష్
వర్ధంతి సందర్భంగా మహా అన్నదానం
కాకతీయ, తొర్రూరు : మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు పాలకుర్తి నియోజకవర్గానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని దుగ్యాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వెల్తూరి మల్లేష్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
మల్లేష్ మాట్లాడుతూ, బీఏఎంఎస్ చదివిన దుగ్యాల శ్రీనివాసరావు తొలి రోజుల్లో వైద్యుడిగా ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి పీఏసీఎస్ చైర్మన్‌గా తొలి అడుగు వేసి, 2004లో అప్పటి చెన్నూరు (ప్రస్తుత పాలకుర్తి) నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు.
తొర్రూరు ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ సివిల్ కోర్టు, గిరిజన తండాలు–మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణం సహా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత దుగ్యాలకే దక్కిందని చెప్పారు. ప్రజా నాయకుడు దివంగతుడైనప్పటికీ ఆయన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ దుగ్యాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల పరంపర కొనసాగిస్తామని మల్లేష్ స్పష్టం చేశారు.


