పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : 2025–26 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ–హరిత విద్యాలయ రేటింగ్ కార్యక్రమంలో బూర్గంపాడు మండలంలోని ఎంపీపీ స్కూల్ (ఎంపీపీఎస్) బుడ్డగూడెం ప్రైమరీ విభాగంలో ఉత్తమ పాఠశాలగా ఎంపికై జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా కేంద్రంలోని ఆనందగని పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ బుడ్డగూడెం పాఠశాల ప్రతినిధులకు ఈ అవార్డును అందజేశారు. పాఠశాలలో స్వచ్ఛత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ చర్యలు, విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకే ఈ గౌరవం లభించిందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పినపాక పట్టణ సముదాయం ప్రధానోపాధ్యాయులు ఉషారాణి, బుడ్డగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. ఈశ్వర్, ఉపాధ్యాయులు మధు తదితరులు పాల్గొన్నారు.
అవార్డు సాధించిన పాఠశాల యాజమాన్యాన్ని జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షాతిరేకాలతో అభినందించారు.


