- జిల్లా కలెక్టర్ రాజర్షి షా
కాకతీయ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా మంగళవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో, దేశ సరిహద్దుల రక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు విశిష్ట అతిథిగా, ముఖ్య అతిథులుగా ఎంపీ గోడం నాగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తమ కుటుంబాలను పక్కన పెట్టి ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం పోలీసులు మాత్రమే చేయగలరని తెలిపారు. వారి సేవలు నిస్వార్థమైనవి, త్యాగపూరితమైనవని అన్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21న లడక్ సమీపంలోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో చైనీయుల దాడిలో పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారని, ఆ సంఘటనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 191 మంది పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో 50 మంది పోలీసు సిబ్బంది త్యాగాలు చేశారని, వారి స్ఫూర్తితో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజల భద్రత కోసం ముందుకు సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి. సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, కమతం ఇంద్రవర్ధన్, డీఎంహెచ్వో నరేంద్ర రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఆర్టీసీ ఆర్‌ఎం, రెండో బెటాలియన్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


