కాకతీయ, తెలంగాణ బ్యూరో: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ సిబ్బందిని స్మరించుకుంటూ, గురువారం (సెప్టెంబర్ 11) నెహ్రూ జూలాజికల్ పార్కులో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. 1730లో రాజస్థాన్‌లో బిష్నోయి తెగకు చెందిన 360 మంది కేజ్రి చెట్లు కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన సంఘటనను గుర్తుచేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న “అటవీ అమరవీరుల దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణలో కూడా ఈ రోజున ప్రతి సంవత్సరం అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.
అటవీ సిబ్బంది త్యాగాలు:
తెలంగాణలో 1984 నుండి ఇప్పటివరకు 22 మంది అటవీ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను అర్పించి, అడవులను రక్షించారని మంత్రి గుర్తు చేశారు. అక్రమ కలప రవాణా, అటవీ భూముల ఆక్రమణలను అరికట్టడంలో వీరు అచంచల ధైర్యంతో పని చేశారని కొనియాడారు. 2014 నుండి 2025 జూలై వరకు టేకు, మారు జాతి కలప స్మగ్లింగ్ కేసులు, 10,375 భూ ఆక్రమణ కేసులు నమోదు అయ్యాయి. 2025 సంవత్సరంలో మాత్రమే 96,813 కేసులు నమోదు చేసి, రూ.149.66 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకుని, రూ.51.50 కోట్ల జరిమానా వసూలు చేశారని వివరించారు. అదేవిధంగా 18,002 వాహనాలు స్వాధీనం చేసుకోవడం, 29,858 గుర్తు తెలియని కేసులు (UDOR) నమోదు చేసి, రూ.67.13 కోట్ల విలువైన అక్రమ కలపను స్వాధీనం చేసినట్లు తెలిపారు.
అటవీ రక్షణ కోసం చర్యలు:
*రాష్ట్రంలో 174 బేస్ క్యాంపులు, 62 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
*అడవుల్లో పశువుల చొరబాటును అరికట్టేందుకు కాలువలు నిర్మిస్తున్నారు.
*సాయుధ పోలీసు దళాల సహాయంతో కలప స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
*PD Act కింద టేకు అక్రమ రవాణాదారులపై 5 కేసులు నమోదు చేశారు.
అలాగే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అటవీ శాఖను బలోపేతం చేయడానికి 2,118 వాహనాలు (2008 బైక్‌లు, 110 జీపులు) అందజేశామని, 2022లో 1,516 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చి, ప్రస్తుతం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు.
అటవీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:
అడవులను రక్షించడమే కాకుండా, వన్యప్రాణుల ఆవాసాలను మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అటవీ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అమరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొని, తమ త్యాగాలతో చరిత్రలో నిలిచిపోయిన అటవీ అమరవీరులను స్మరించారు.


