- బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్: వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. శనివారం కరీంనగర్ మహాశక్తి ఆలయం వద్ద వరంగల్ వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్” గోడ ప్రతిని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వికసిత్ భారత్ కోసం యువత అందరూ ఒక్క తాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ, విలువలు, దేశభక్తి, సామాజిక స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
“వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ క్విజ్”లో యువత అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రిని కలిసే అవకాశం, జాతీయ యువజన ఉత్సవాలలో పాల్గొనే అవకాశమూ ఉంటుందని చెప్పారు. త్వరలో వాగ్దేవి కళాశాలలో నిర్వహించే వికసిత్ భారత్ సదస్సుకు హాజరవుతానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కళాశాల జాతీయ సేవా పథక అధికారి ప్రొఫెసర్ మొహమ్మద్ ఆజమ్, విద్యార్థులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుంజేటి శివ, తదితరులు పాల్గొన్నారు.


