గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం
సర్పంచ్ బండమీది సంతోషి కర్ణాకర్
మహిళా సమైక్య భవనానికి భూమి పూజ
వడ్డీ లేని రుణాల సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
కాకతీయ, చేర్యాల : గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్థానిక సర్పంచ్ బండమీది సంతోషి కర్ణాకర్ అన్నారు. శుక్రవారం ఈజిఎస్ నిధులతో మంజూరైన మహిళా సమైక్య భవనానికి గ్రామ మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఆమె భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి మహిళలు ముందుండి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. మహిళా సమైక్య భవనం నిర్మాణంతో మహిళా సంఘాల కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆవుల సందీప్, మాజీ ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్, సీసీ యాకూబ్, పంచాయతీ కార్యదర్శి ఏలూరి రాజు, నల్లపోచమ్మ చైర్మన్ గుడేపు మహేష్, సీఏలు జ్యోతి, యాకమ్మ, వివో అధ్యక్షురాలు సుగుణ, మాధవి, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


