సమాజ సేవలో ఆర్ఎస్ఎస్ పాత్ర అపూర్వం
కరీంనగర్ విద్యావేత్తల సమావేశంలో కార్యవాహ కాచం రమేష్
కాకతీయ, కరీంనగర్ : వందేళ్లుగా సమాజం, మాతృభూమి సేవే లక్ష్యంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అని, సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే సంఘ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ అన్నారు.
ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహించిన విద్యావేత్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంఘ స్థాపన నాటి నుంచి హిందూ సమాజానికి అవసరమైన ప్రతి రంగంలో ఆర్ఎస్ఎస్ నిరంతర సేవలు అందిస్తూ వస్తోందన్నారు.
శతాబ్ది సందర్భంగా సమాజ పరివర్తన ద్వారా దేశ పరమవైభవం సాధ్యమని లక్ష్యంగా ‘పంచ పరివర్తన్’ పిలుపును ఆర్ఎస్ఎస్ ఇచ్చిందన్నారు. కుటుంబ ప్రబోధన్, స్వదేశీ భావన, సామాజిక పరివర్తన, పర్యావరణ పరిరక్షణ, పౌర బాధ్యతలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను స్వయంసేవకులు విస్తృతంగా చేపడుతున్నారని తెలిపారు. 1925లో విజయదశమి రోజున డాక్టర్ కేశవ్ రావు బలి రామ్ పంత్ హెడ్డగేవార్ ప్రారంభించిన ఆర్ఎస్ఎస్, వందేళ్లుగా స్వచ్ఛందంగా సమాజ సేవ చేస్తోందన్నారు. హిందుత్వాన్ని మత లేదా రాజకీయ కోణంలో మాత్రమే చూడటం ద్వారా ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవడం సాధ్యం కాదని, సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే కొంతకాలం కార్యకలాపాల్లో భాగస్వాములవ్వాలని సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమావేశంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, కరీంనగర్ జిల్లా సంఘచాలక్ సీఏ నిరంజనాచారి, జిల్లా సహ సంఘచాలక్ ఎలగందుల సత్యనారాయణతో పాటు పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.


