రాజిరెడ్డి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ దయనీయ స్థితి
సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన కాలనీ వాసులు
కాకతీయ, కరీంనగర్ : విద్యానగర్ సమీపంలోని శ్రీరామ్ నగర్ కాలనీ రోడ్ నెం.5 రాజిరెడ్డి కాలనీ వాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. రహదారులు గుంతలతో నిండిపోవడం, డ్రైనేజీ కాలువలు తరచూ మూసుకుపోవడం వల్ల మురుగు నీరు రోడ్లపైకి, ఇళ్లలోకీ చేరిపోతుంది. దాంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.కాలనీలో దాదాపు 200కు పైగా ఇళ్లు నిర్మించబడ్డాయి. అయినప్పటికీ ఇప్పటికీ సి.సి. రోడ్లు వేయకపోవడంతో వర్షాలు పడితే రోడ్లు బురదమయమై రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. స్కూల్ బస్సులు, ద్విచక్ర వాహనదారులు ప్రతిరోజూ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వాసులు చెబుతున్నారు.ప్రత్యేకంగా శ్రీరామ్ నగర్ రోడ్ నెం.6, 7, 8 నుండి వచ్చే మురుగు నీటిని రోడ్ నెం.5 లో కలిపి వదిలేయడం వలన ఆ ప్రాంతం దుర్వాసనతో నిండిపోతుంది. రోడ్లు పాడైపోవడంతో పాటు ఇళ్ల ముందు వరకు నీరు చేరిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇతర కాలనీల్లో సి.సి. రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసినా తమ కాలనీకి ప్రతిసారి “ఫండ్స్ లేవు” అని అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కరెంటు హై వోల్టేజ్, లో వోల్టేజ్ సమస్యలతో కూడా వాసులు ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే పలుమార్లు అధికారులను సంప్రదించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, సమస్యలపై దృష్టి సారించకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా కు దిగిన కాలనీ వాసులు.తక్షణమే కొత్త డ్రైనేజీ వ్యవస్థ, సి.సి. రోడ్లు వేయించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.


