విద్య హక్కును ఖచ్చితంగా అమలు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో కాగితాలకే పరిమితం
ఆన్‌లైన్ అడ్డంకులు రాజ్యాంగ విరుద్ధం
హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మారెళ్ళ విజయకుమార్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : విద్య హక్కుపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేటెడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మారెళ్ళ విజయకుమార్ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన విద్య హక్కు నిబంధనలకే పరిమితం కాకుండా, భూమిపై అమలయ్యే మౌలిక హక్కుగా ఉండాలనే స్పష్టమైన సందేశాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం కింద ప్రైవేటు, ప్రభుత్వ సహాయం లేని పాఠశాలల్లో పేద కుటుంబాల పిల్లలకు ఇరవై ఐదు శాతం సీట్లు తప్పనిసరిగా కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఇది దయాదాక్షిణ్యం కాదని, రాజ్యాంగబద్ధమైన మౌలిక హక్కు అని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసిందని తెలిపారు. ఈ తీర్పు రెండు వేల ఇరవై ఆరు–ఇరవై ఏడు విద్యా సంవత్సరపు అడ్మిషన్ల నుంచే అమలులోకి రావాల్సి ఉందన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేయలేదనే కారణంతో పేద పిల్లలకు అడ్మిషన్లు నిరాకరించడం రాజ్యాంగ ఆత్మకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందన్నారు. ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థికి రైట్ టు ఎడ్యుకేషన్ కోటాలో సీటు నిరాకరించిన ఘటన నుంచే ఈ వ్యవహారం దేశవ్యాప్త సమస్యగా మారిందని తెలిపారు. డిజిటల్ అజ్ఞానం, భాషా అడ్డంకులు, సమాచారం లోపం కారణంగా పేద పిల్లలు హక్కు కోల్పోతున్నారని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించిందన్నారు.
సామాజిక మార్పుకు విద్యే పునాది
రెండు వేల తొమ్మిదిలో అమలులోకి వచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం, ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలుడికి ఉచిత, తప్పనిసరి విద్యను హామీ ఇస్తుందని మారెళ్ళ విజయకుమార్ గుర్తు చేశారు. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలు తమ మొదటి తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన, సామాజికంగా బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సీట్లకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం భరించాల్సి ఉంటుందన్నారు. విభిన్న వర్గాల పిల్లలు ఒకే తరగతిలో చదువుకోవడం ద్వారా కుల, మత, ఆర్థిక గోడలు కూలిపోవాలన్నదే ఈ చట్టం అసలు ఉద్దేశమని వివరించారు. కానీ అనేక రాష్ట్రాల్లో ఈ నిబంధన కాగితాలకే పరిమితమైందని విమర్శించారు.
కఠిన అమలే పరిష్కారం
రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం సామాజిక మార్పుకు కీలక సాధనమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థులతో పాటు జర్నలిస్టుల పిల్లలకు కూడా ఈ హక్కు వర్తింపజేయాలని, దీనిపై జిల్లా డీఈవో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్య హక్కు అమలులో ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మారెళ్ళ విజయకుమార్ స్పష్టం చేశారు.
.


