డ్రైవర్ల పోరాటానికి ఫలితం
జీతభత్యాలపై చర్చలు సఫలం
నూతన వేతనాల ఒప్పందం ఖరారు
కాకతీయ, నర్సంపేట టౌన్: డిసెంబర్ 2025తో ముగిసిన పాత వేతనాల ఒప్పందానికి కొనసాగింపుగా నర్సంపేట పట్టణంలో హైర్ బస్ డ్రైవర్ల జీతభత్యాలపై యాజమాన్యం–డ్రైవర్స్ యూనియన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. డ్రైవర్ యూనియన్ నాయకులు ఇచ్చిన డిమాండ్ నోటీసు నేపథ్యంలో ఇరు వర్గాలు నూతన వేతనాల ఒప్పందాన్ని ఖరారు చేశారు. నూతన ఒప్పందం ప్రకారం పల్లె వెలుగు డ్రైవర్‌కు 15 రోజులకు రూ.18,500, ఎక్స్ప్రెస్ డ్రైవర్‌కు 15 రోజులకు రూ.20,500 వేతనం నిర్ణయించారు. టెంపరరీ డ్రైవర్లకు పల్లె వెలుగు బస్సుకు రోజుకు రూ.1,250, ఎక్స్ప్రెస్ బస్సుకు రోజుకు రూ.1,400 చెల్లించనున్నారు. దసరా పండుగ సందర్భంగా కనీసం ఒక సంవత్సరం సీనియారిటీ ఉన్న ప్రతి డ్రైవర్‌కు రూ.2,000 బోనస్ ఇవ్వాలని అంగీకరించారు. క్లీనర్లకు నెలకు రూ.4,500 వేతనం ఖరారు చేశారు.ఈ అగ్రిమెంట్ 01-01-2026 నుండి 31-12-2028 వరకు అమల్లో ఉంటుంది. ఇకపై ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రస్తుత వేతనాలపై 10 శాతం పెంపు ఇవ్వాలని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగిశెట్టి ప్రసాద్, తెలంగాణ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు లక్కం ప్రభాకర్ సహా యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. డ్రైవర్ యూనియన్ తరఫున అధ్యక్షుడు నల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కందికొండ రాజు, ప్రధాన కార్యదర్శి కట్ల ప్రశాంత్, కోశాధికారి ఎరుకల రాజు తదితరులు హాజరయ్యారు.


