చేప పిల్లలు విడుదల పూర్తి చేయాలి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నిర్దేశిత లక్ష్యం ప్రకారం నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మధిర పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేసారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర నియోజకవర్గ పరిధిలో ఉన్న నీటి వనరులలో 77 లక్షల చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నీటి వనరుల దగ్గర ఎన్ని చేప పిల్లలు విడుదల చేస్తున్నామో వివరాలు తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. చేప పిల్లల కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి మత్స్యకారులకు లబ్ధి చేకూర్చాలని అన్నారు. మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టికి ఈ కార్యక్రమం చేపపట్టామన్నారు. చేపల పంపిణీ కార్యక్రమాన్ని మత్స్య శాఖ అధికారులతో పాటు నీటి పారుదల శాఖ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి శివ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


