గ్యాస్ కొరతకు కేంద్రం నిర్లక్ష్యమే కారణం
దౌత్య విధానం సరిగా లేకపోవడంతోనే ఇంధన సరఫరా సమస్య
హోటల్ రంగం సంక్షోభంలో పడే ప్రమాదం
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపణలు
కాకతీయ, హైదరాబాద్ : దేశంలో ఏర్పడుతున్న గ్యాస్ కొరతకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని డాక్టర్ బాల్మూర్ వెంకట్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌తో అనుసరించిన దౌత్య విధానమే ఈ పరిస్థితికి దారితీసిందని ఆయన అన్నారు. అదే కారణంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు భారతదేశానికి ఇంధన సరఫరాను తగ్గించాయని పేర్కొన్నారు. న్యూట్రల్‌గా ఉన్న ఇతర దేశాలకు మాత్రం చమురు దేశాలు సరఫరా కొనసాగిస్తున్నాయని, అందుకే అక్కడ ఇలాంటి తీవ్ర సమస్యలు కనిపించడం లేదని తెలిపారు. యుద్ధ పరిస్థితులు కొనసాగినా దేశానికి డెబ్బై నాలుగు రోజుల పాటు సరిపోయే ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం గతంలో చెప్పిందని బాల్మూర్ వెంకట్ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు దేశంలో గ్యాస్ నిల్వలు లేవని చెబుతూ కమర్షియల్ సరఫరాను నిలిపివేసి, డొమెస్టిక్ సరఫరా మాత్రమే కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. గ్యాస్ కొరత విషయంలో కేంద్రం రాష్ట్రాలను గందరగోళానికి గురి చేస్తోందని విమర్శించారు. లాక్డౌన్, కరోనా వంటి క్లిష్ట సమయంలో హోటల్ రంగం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, హాస్టళ్లు మాత్రమే కాకుండా వాటికి అనుబంధంగా ఉన్న అనేక పరిశ్రమలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించి గ్యాస్ కొరత సమస్యను సీరియస్‌గా తీసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


