ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలి
ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు
కాకతీయ, గీసుగొండ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా హామీలు నెరవేర్చకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులు పిలుపునివ్వగా, ప్రభుత్వం ముందస్తు చర్యల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతో ఉద్యమకారులను అరెస్టు చేయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను అణచి వేయడానికి ఇటువంటి చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుర్రం రఘు కోరారు.


