సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది
పైప్ లైన్ మరమ్మతుల్లో ఆలస్యం పై ప్రజల ఆగ్రహం
అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన గ్రామస్థులు
కాకతీయ, కూసుమంచి : చిన్న సమస్యల్ని సైతం సకాలంలో పరిష్కరించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మండలంలోని తురకగూడెం గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ పైప్ లైన్ సోమవారం పగిలిపోయింది. సమస్య చిన్నదే అయినప్పటికీ నాలుగు రోజులుగా మరమ్మత్తులు పూర్తి చేయకపోవడంతో గ్రామానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పైప్ లైన్ మరమ్మతుల్లో జాప్యం
పైప్ లైన్ మరమ్మత్తు పనులు గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి సారి పైప్ లైన్ దెబ్బతిన్నప్పుడు ఇలాగే రోజుల తరబడి నీటి సరఫరా నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవి ప్రారంభమవడంతో నీటి అవసరం పెరిగిన సమయంలో ఇలాంటి నిర్లక్ష్యం అసహనాన్ని కలిగిస్తోందన్నారు. చిన్న సమస్యలను కూడా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు అనవసర కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇకనైనా అధికారులు అప్రమత్తమై సకాలంలో సిబ్బందిని పంపించి మరమ్మత్తులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


