సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత
గ్రామపాలనలో నమ్మకమే మూలం
ప్రజల గడపకు ప్రభుత్వ పథకాలు చేరాలి
పారదర్శకతతో..సమన్వయంతో సేవలు అందాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం : గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకుని పనిచేస్తేనే ప్రజల నమ్మకం నిలబడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా సర్పంచులు చొరవ చూపాలని సూచించారు. ఖమ్మం నగరంలోని టిటిడిసి సమావేశ మందిరంలో జిల్లాలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులకు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని గ్రామపాలనలో సర్పంచుల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అందించాల్సిన సేవలపై విస్తృత అవగాహన కల్పించారు.

పారిశుధ్యం–వీధిదీపాలపై ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజల మన్ననలు పొంది సర్పంచులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయని, అలాంటి పరిస్థితుల్లో గెలుపొందడం మరింత బాధ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. గ్రామ పాలనలో పంచాయతీ సెక్రటరీతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతమైన పరిపాలన అందించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని ప్రధాన అజెండాగా తీసుకోవాలని, ప్రతిరోజూ ఉదయం ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ ప్రజలు బయటకు వచ్చే సమయానికి ఊరంతా పరిశుభ్రంగా కనిపించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. వీధిదీపాల నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కాలనీతో పాటు ప్రధాన కేంద్రాల్లో సరిపడా వీధిలైట్లు ఏర్పాటు చేసి నిర్వహణ చేపట్టాలని తెలిపారు.
పన్నుల వసూలుతో పంచాయతీకి ఆదాయం
గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు నర్సరీలను అభివృద్ధి చేయాలని, ఉన్న చెట్ల సంరక్షణతో పాటు కొత్త మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. పంచాయతీకి ఆదాయం పెరిగేలా పన్నుల వసూలు సమయానికి చేపట్టాలని, తద్వారా పంచాయతీ నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ ట్యాంకులను కాలానుగుణంగా శుభ్రపరిచి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలని, పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు సమయానికి చెల్లించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా కాక ప్రజల సేవకులుగా వ్యవహరిస్తే గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వాలని, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామ పంచాయతీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దీక్షా రైనా, శిక్షణ తరగతుల పర్యవేక్షకురాలు విద్యాలత, సంబంధిత శాఖల అధికారులు, ఖమ్మం జిల్లాలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


