నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలి
వైద్యులు సమయపాలన పాటించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఉచిత మందులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఔషధ నిల్వలను క్రమం తప్పకుండా పరిశీలించాలని, గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని సూచించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలన్నారు. ఆసుపత్రి ఆవరణ, వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాంబశివరావు, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిషన్, డా. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


