పల్లెల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
*పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ,పరకాల : పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మండలంలోని కౌకొండ, వెంకటేశ్వర్లపల్లి,సర్వాపురం గ్రామాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాలు, గ్రామ ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ పల్లెప్రజలు కాంగ్రెస్ 420 బోగస్ హామీలను నమ్మి మోసపోయిన విషయాన్ని బాగా గ్రహించారని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్న ఆయన… మళ్లీ మోసపోవద్దు… గోస పడొద్దు అంటూ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. అమలుకి సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.పల్లెల ప్రగతికై నిజాయితీగా పనిచేసే అభ్యర్థులను ఎంపిక చేసి ఓటు హక్కును వినియోగించా లని ప్రజలను కోరారు.గ్రామాల్లో ఎన్నికలున్నాయని మహిళలకు చీరలు పంపిణీ చేసి పట్టణాల్లో ఇవ్వకపోవడం కాంగ్రెస్ ఓట్ల రాజకీయమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేపట్టిన రైతుబంధు,రైతుబీమా,దళితబంధు, కల్యాణలక్ష్మి,షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలు గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించాయని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన 14ఏళ్ల పోరాటం, పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి ప్రజలకు మేలు చేసిందని వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో, రైతుల్లో ఏ మార్పూ రాలేదని, రెండుేళ్ల రేవంత్ పాలనలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కోసం బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డితో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.ఈ కార్యక్రమాల్లో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.


