శాంతి మార్గమే మానవాళికి దారి
తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు
కాకతీయ, తొర్రూరు : క్రీస్తు త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్ని అనుసరించాలని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు పిలుపునిచ్చారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్వో సుధీర్ రెడ్డితో కలిసి డాక్టర్ సుగుణాకర్ రాజు కేక్ కట్ చేసి వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సుగుణాకర్ రాజు మాట్లాడుతూ, యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ రోజు అని అన్నారు. ప్రేమ మార్గంలో నడిస్తే ఎవరి మనసునైనా జయించవచ్చని ఏసుక్రీస్తు తన జీవితంతో నిరూపించారని పేర్కొన్నారు. సర్వ మానవాళికి మేలు కలగాలని ఏసుప్రభువును ప్రార్థిద్దామని, పేదల పట్ల దయ, ధర్మాన్ని నమ్మిన వారికి దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని అన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి బి. నందనా దేవి, డాక్టర్లు మీరాజ్, గిరి ప్రసాద్, సుమన్, కళ్యాణ్, శంకర్, అనిల్, ప్రియాంక, మానసతో పాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


